కరీంనగర్, జూలై 27
శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ పదవిని ఈసారి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని, తద్వారా సామాజిక న్యాయాన్ని పాటించాలని పలువురు నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర సామాజిక వర్గాలకు ఈ పదవిని కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి తమ వర్గానికి అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా) అధ్యక్ష పదవిని ఈసారి తమ సామాజిక వర్గానికి కేటాయించాలని మాదిగలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పదవిని వెలమ సామాజిక వర్గానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సామాజిక సమీకరణల దృష్ట్యా ఈసారి సుడా చైర్మన్ పదవిని మాదిగలకు కట్టబెట్టాలని వారు డిమాండ్ చేశారు.
సోమవారం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం మాజీ కన్వీనర్ కనకం విద్యాసాగర్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోస్కి శంకర్ మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో బీసీ, పార్లమెంట్ ఎన్నికల్లో వెలమ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గాలకు అవకాశం కల్పించిన కాంగ్రెస్, ఈసారి అనాదిగా పార్టీ వెంటే ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
కరీంనగర్ జిల్లాలో మాదిగ సామాజిక వర్గం గణనీయంగా ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో రాజకీయ అధికారం, నామినేటెడ్ పదవులు, పాలన అవకాశాలు దక్కకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 60 వేలకు పైగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని, జనాభా దామాషా ప్రాతిపదికన వారికి రాజకీయ, పాలన పదవులు దక్కాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో మాదిగ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత దక్కలేదని వారు తెలిపారు. శాసనసభ ఎన్నికల ముందు పేర్కొన్న చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలోనూ 57 వేలకు పైగా మాదిగ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నందున, వారందరూ అనాదిగా కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తున్నందున శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ కు కేటాయించాలని వారు కోరారు.
తమది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ అని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పదేపదే ప్రకటిస్తున్నందున, ఆ సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని వారు అన్నారు.
విలేకరుల సమావేశంలో భీమ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్, రావణ్, కొయ్యడ వినోద్, అనిల్, సురేష్, వాసాల మనోహర్, అనిల్, సతీష్, శంకరయ్య, కొమ్ము బాబు, మాతంగి విష్ణు, రాజు, కనకం కుమార్, గాలిపల్లి ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












