కుంటాల మండలంలోని పెంచకల్పాడ్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఓటరు నమోదు ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రజలకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోపు తమ పేర్ల నమోదు, మార్పులు, చిరునామా సవరణలు, తొలగింపులు వంటి దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అవసరమైన వారికి అక్కడికక్కడే దరఖాస్తులు నింపించి సహాయం అందించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు వివరాలు సరైన విధంగా ఉండేలా ప్రత్యేక సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హిమ్మత్రావు పటేల్, భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సాయి సూర్యవంశీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, బూత్ స్థాయి అధికారి శ్యామలతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.










