Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న వర్షాల సమస్య, దేశవ్యాప్తంగా నెలకొన్న గంభీర వాతావరణం నేపథ్యంలో తన 50వ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. కేకులు, ఫ్లెక్సీలు వంటి ఆర్భాటాలకు పోకుండా, ఆ ఖర్చులను సేవా కార్యక్రమాలకు వినియోగించాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు, దేశవ్యాప్తంగా నెలకొన్న గంభీర వాతావరణం నేపథ్యంలో తన 50వ జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని, కేకులు, ప్లెక్సీలు, అనవసర హంగులు, ఆర్భాటాలు చేయవద్దని నాయకులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు కేక్ కటింగ్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, పూల బొకేలు, పత్రికా ప్రకటనలు వంటి వాటిపై అనవసరంగా ఖర్చు చేయవద్దని పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ ఖర్చులను తమకు చేతనైన మేరకు సేవా కార్యక్రమాలకు వినియోగించాలని, ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి సాయం అందేలా చూడాలని ఆయన సూచించారు.
సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారానే తన జన్మదినాన్ని అర్థవంతంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు.











