ఫాంహౌస్‌ పార్టీపై పోలీసుల దాడి

ఫాంహౌస్‌ పార్టీపై పోలీసుల దాడి

ఫాంహౌస్‌ పార్టీపై పోలీసుల దాడి

పట్టుబడిన 51 మంది విదేశీయులు.. వారిలో ముగ్గురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

భారీగా మద్యం స్వాధీనం

15 మందికే వీసా ఉన్నట్టు గుర్తింపు

మొయినాబాద్‌: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం బాకారం గ్రామంలోని ఎస్‌కే రీట్రీట్‌ ఫాంహౌ్‌సలో అనుమతులు లేకుండా జరుగుతున్న పార్టీపై రాజేంద్రనగర్‌ పోలీసులు దాడి చేశారు. 37 మంది మహిళలు సహా 51 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విదేశీయుల్లో 15 మందికి మాత్రమే వీసా ఉండడం గమనార్హం. అయితే, ఘటనాస్థలిలో ఎలాంటి డ్రగ్స్‌ లభించనప్పటికీ ముగ్గురికి పరీక్షల్లో డ్రగ్స్‌ పాజిటివ్‌ అని తేలినట్టు తెలిసింది. రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. ఉగాండాకు చెందిన మామస్‌ అనే మహిళ ఎస్‌కే రీట్రీట్‌ ఫాంహౌ్‌సలో తన పుట్టిన రోజు పార్టీ ఏర్పాటు చేసింది. ఉగాండాతోపాటు నైజీరియా, కెన్యా, జింబాబ్వే తదితర ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన 51 మంది ఈ పార్టీకి హాజరయ్యారు.

పార్టీలో భాగంగా వీరంతా డీజే సౌండ్‌ సిస్టమ్‌ పెట్టుకుని మద్యం, డ్రగ్స్‌, హుక్కా వినియోగిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పార్టీకి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో 90 మద్యం సీసాలు, హుక్కా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు మహిళలు, ఓ పురుషునికి పాజిటివ్‌గా తేలింది. అయితే, ఘటనాస్థలిలో మాదక ద్రవ్యాలు లభించకపోవడంతో వారు గతంలో డ్రగ్స్‌ తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఫాంహౌస్‌ యజమాని, నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పట్టుబడిన 51 మందిలో 15 మంది మినహా మిగిలిన వారి వీసా గడువు ఇప్పటికే ముగిసినట్టు, వారంతా అక్రమంగా దేశంలో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. విచారణ కొనసాగుతోంది.

శంషాబాద్‌ ఎంఆర్‌జీ ఫాంహౌస్‌లో ఏడుగురి అరెస్టు

శంషాబాద్‌ రూరల్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని గండిగూడ ఎంఆర్‌జీ ఫామ్‌హౌ్‌సలో నిషేధిత హుక్కా సేవిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఫాంహౌ్‌సలో పార్టీ పేరిట హుక్కా సేవిస్తున్న వారిని అరెస్టు చేశామని శంషాబాద్‌ ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. అరెస్టయిన వారిలో ఎండీ దస్తగిరి, ఎస్‌కే అసద్‌, అర్బాజ్‌ షరీఫ్‌, సయ్యద్‌ అర్బాజ్‌, ఎండి ఆమీర్‌, ఎండి రేహన్‌, ఎండీ ఫరజ్‌ ఉన్నారు. వారి నుంచి ఆరుకు పైగా హుక్కా సీసాలు, సంబంధిత సామగ్రి, ద్విచక్రవాహనం, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment