మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
పసిఫిక్ ఎల్ నీనో ప్రభావంతో గతంలో ఎండలతో అల్లాడిన తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఊరటనిస్తోంది. రానున్న మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
మొన్నటిదాకా ఎండలతో అల్లాడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బంగాళాఖాతం అభయమిచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో ప్రభావం తగ్గి, ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది రైతులకు, ప్రజలకు శుభవార్తగా మారింది.
గతంలో ఎండలు దంచి కొట్టడంతో వర్షాలు లేక వరి నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి నారుమడులను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడిగా ఉండటం వల్ల నైరుతి రుతుపవనాలు విస్తరించలేదు. దీనికి ఎల్ నీనో కారణమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే వర్షాలు కురుస్తాయని వారు గతంలోనే సూచించారు.
అనుకున్నట్టుగానే ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా. దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయువ్య బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరికొన్ని రోజుల్లో బలపడే అవకాశం ఉంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, అదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు, పిడుగులు పడ్డాయి. అల్పపీడనం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో విద్యుత్ డిమాండ్ కూడా పడిపోయింది.












