నిర్మల్, జూలై 2
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో జరిగిన చోరీ కేసును జిల్లా పోలీసులు పది రోజుల్లోనే ఛేదించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాల సహకారంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న సుప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాల సహకారంతో కేవలం పది రోజుల్లోనే కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల వెల్లడించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఆలయంలో చోరీ జరిగినట్లు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, సాంకేతిక విశ్లేషణ ఆధారంగా పల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనంద్‌లను నిందితులుగా గుర్తించినట్లు చెప్పారు. వీరంతా పాత నేరస్తులేనని, రైలు సౌకర్యం ఉన్న గ్రామాలు, పట్టణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటం వీరి నేరపద్ధతి అని పేర్కొన్నారు.
నిందితుల వద్ద నుంచి 1.220 కిలోల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీలు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు రైలులో నాందేడ్‌కు వెళ్తుండగా బాసర రైల్వే స్టేషన్లో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారని ఎస్పీ వెల్లడించారు.
కేవలం పది రోజుల్లోనే కేసును ఛేదించిన దర్యాప్తు బృందం పనితీరును జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల అభినందించారు. కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ వారి సేవలను కొనియాడారు.












