పసాయ్ నగరం (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 26
వలస కార్మికుల రక్షణ, సంక్షేమం, నైతిక నియామక విధానాలు, పునరావాసం వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల ప్రతినిధులు అధ్యయన పర్యటన చేపట్టారు. ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహారాల శాఖ, వలస కార్మికుల శాఖ సహకారంతో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ ఈ పర్యటనను నిర్వహించింది.
వలస కార్మికుల రక్షణ, సంక్షేమం, నైతిక నియామక విధానాలు, పునరావాసం వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల ప్రతినిధులు అధ్యయన పర్యటన చేపట్టారు. ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన సాంకేతిక సహకార మండలి, వలస కార్మికుల శాఖ సహకారంతో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ ఈ పర్యటనను నిర్వహించింది. సురక్షితమైన, నైతికమైన, క్రమబద్ధమైన కార్మికుల వలస విధానాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. వలస కార్మికుల రక్షణ, సంక్షేమం, నైతిక నియామక ప్రక్రియలు, పునరావాసం తదితర అంశాల్లో పరస్పర జ్ఞాన మార్పిడికి ఈ పర్యటన దోహదపడిందని అధికారులు తెలిపారు.
స్వాగతం, సందేశాలు
కార్యక్రమాన్ని ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహారాల శాఖ ఉప కార్యదర్శి మరియా ఆండ్రెలిటా ఎస్. ఆస్ట్రియా స్వాగత ప్రసంగంతో ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఎం. వినోద్ కుమార్ సందేశం అందించారు. దీనికి ఫిలిప్పీన్స్ వలస కార్మికుల శాఖ సహాయ కార్యదర్శి మేరీ గ్రేస్ ఎల్. రిగ్యూర్-టియోడోసియో స్పందించారు.
పాలనా విధానాలపై చర్చ
ఫిలిప్పీన్స్లో అమలవుతున్న కార్మికుల వలస పాలనా విధానం, నైతిక నియామక పద్ధతులు, కార్మికుల రక్షణ, సంక్షేమం, పునరావాసానికి సంబంధించిన కీలక విధానాలను వలస కార్మికుల శాఖ అధికారులు వివరించారు. ఆయా రంగాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలంగాణ ప్రతినిధులకు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ చర్చలో కార్మికుల వలసకు సంబంధించిన పలు అంశాలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
భవిష్యత్ సహకారంపై భరోసా
కార్యక్రమం ముగింపులో వలస కార్మికుల శాఖ విధాన, అంతర్జాతీయ సహకార విభాగం బాధ్యులు మరియా తెరెసా డి. డెలోస్ సాంటోస్ కృతజ్ఞతలు తెలిపారు. ఫిలిప్పీన్స్, తెలంగాణ రాష్ట్రాలు వలస కార్మికుల కోసం సురక్షితమైన, క్రమబద్ధమైన, నైతికమైన, గౌరవప్రదమైన విధానాలను అభివృద్ధి చేయడంలో పరస్పర సహకారాన్ని కొనసాగించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నారై సలహా కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు. భవిష్యత్తులో మరింత బలమైన సహకారానికి ఈ అధ్యయన పర్యటన మార్గం సుగమం చేసిందని ఆయన పేర్కొన్నారు.












