హైదరాబాద్, 2026-08-26
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ముందస్తు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల నినాదాలపైనే దృష్టి సారిస్తున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, రైతు సమస్యలు, విద్యా, వైద్య రంగాల వంటి కీలక అంశాలపై చర్చ జరగడం లేదని డా.ఆర్.ఎల్.మూర్తి పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహారశైలి చూస్తే ఎన్నికలు ముందే వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. రెండు పార్టీల సభల్లోనూ వచ్చేది మేమే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే అనే రాజకీయ నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికలు క్రమంగా ముందస్తు ఎన్నికల ప్రచార సభలుగా మారుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పలుమార్లు ప్రకటించారు. ఇటీవల పరకాల సభలో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో తమకే అధికారం వస్తుందని ప్రచారం చేస్తోంది. అయితే ఎన్నికలకు ముందే ప్రజల రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేయడంకంటే, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని డా.ఆర్.ఎల్.మూర్తి తన విశ్లేషణలో పేర్కొన్నారు.
ప్రభుత్వ వాదనలు, ప్రతిపక్ష విమర్శలు
అధికార పక్షం గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేరుకుపోయిన అప్పులు, ఆర్థిక భారాలు, పెండింగ్ బిల్లులు, అసంపూర్తి ప్రాజెక్టులే తమకు వారసత్వంగా వచ్చాయని చెబుతోంది. ప్రతిపక్షం మాత్రం తాము చేసిన అభివృద్ధిని ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందని విమర్శిస్తోంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయంగా సహజమే అయినప్పటికీ, వాటి మధ్య అసలు ప్రజా సమస్యలు మరుగున పడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రశ్నలు
నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాల హామీ ఎప్పుడు అమలవుతుంది రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, రుణభారం నుంచి ఉపశమనం ఎలా లభిస్తుంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఎప్పుడు అందుతాయి పేదలకు నాణ్యమైన వైద్యం ఎక్కడ లభిస్తుంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులు ఎప్పుడు అందుతాయి ఇవే ఇప్పుడు చర్చకు రావాల్సిన ప్రశ్నలని డా.మూర్తి స్పష్టం చేశారు.
విద్యారంగంపై దృష్టి సారించాలి
విద్యారంగం తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అంశం. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయకుండా ప్రైవేటు విద్యావ్యవస్థ విస్తరణనే అభివృద్ధిగా చూడటం సరైంది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకాలు, పరిశోధనకు నిధులు, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టళ్ల వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ అవసరం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ హామీ అమలుపైనా స్పష్టత రావాలని ఆయన కోరారు.











