నిర్మల్, 2026-07-30
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వానలకు వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేని వానల ధాటికి పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగగా, చెరువులు తెగిపోయి, రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల పంటలు నీటమునిగాయి. తెలంగాణలో 621 మండలాలుంటే ఏకంగా 587 చోట్ల మంగళవారం వర్షం పడింది. 30 మండలాల్లో అయితే 10-20 సెంటీమీటర్ల మధ్య భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది.
ముఖ్యంగా నిర్మల్ జిల్లా బల్లివాగు దాటుతూ ఒక గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోగా, ములుగు జిల్లా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చి, జంపన్నవాగులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని చామన్పెల్లికి చెందిన మర్సుకోల పారుబాయి(50) వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణం కోల్పోయింది. తన భర్త మధుతో కలిసి బుధవారం ఉదయం పింఛన్ డబ్బులు తీసుకోవడానికి సోమార్పేట్ (ఎర్వచింతల్) వెళ్లి, కూరగాయల కొనుగోలుకు ఒంటరిగా వెళ్లిన పారుబాయి.. తిరిరి చామన్పెల్లికి బయలుదేరింది. మార్గమధ్యంలో బల్లివాగు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ కొట్టుకుపోయింది. ఓ చెట్టు వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. అలాగే, ములుగు జిల్లాలోని జంపన్నవాగులో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ పీట్ల తిమ్మయ్య(45) గల్లంతయ్యాడు. సమ్మక్కసారలమ్మ దర్శనానికి వెళ్లి, జంపన్నవాగు ఘాటు వద్ద మెట్లపై పుణ్యస్నానం ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు వరద నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా అతడి ఆచూకీ లభించలేదు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామలో ఇల్లు కూలి ఆత్రం లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి 163పైకి నీరు చేరింది. చీకుపల్లి వద్ద ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం వరదనీటితో ఉరకలేస్తోంది. దీంతో జలపాతం సందర్శనను నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్-ధర్మారం మధ్య ప్రధాన రహదారి వరద నీటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు విఘాతం కలగగా, పెంబి మండలంలో కడెం వాగు పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం నాటికి 30 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్షాల ధాటికి పలు జిల్లాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి.
జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్కా్స్ట మైన్ 2, 3లో ఉత్పత్తి నిలిచిపోగా, సంస్థకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మల్హర్ మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్టులో 18 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, మంచిర్యాల జిల్లాలోనూ వర్షాల వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. వర్షపు నీరు చేరడంతో గనుల్లో భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజులో దాదాపు 32 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.












