హైదరాబాద్, 2026-08-23
రాష్ట్రంలోని ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా) ఆస్పత్రులు తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. వైద్య పరీక్షలకు అవసరమైన కిట్లు లేవని, అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచడం లేదని బాధితులు వాపోతున్నారు. దీంతో ఈఎస్ఐ చందాదారులు ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
రాష్ట్రంలోని ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా) ఆస్పత్రులు తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. వైద్య పరీక్షలకు అవసరమైన కిట్లు లేవని, అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచడం లేదని బాధితులు వాపోతున్నారు. దీంతో ఈఎస్ఐ చందాదారులు (ఇన్సూరెన్స్ పర్సన్స్-ఐపీలు) ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఈఎస్ఐ కింద సుమారు 20 లక్షల మంది చందాదారులున్నారు. వీరు ప్రతినెలా కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ రూపంలో చెల్లిస్తున్నప్పటికీ, కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈఎస్ఐ కార్పొరేషన్ నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యవసర మందులకూ అవస్థే
రాష్ట్రంలోని నాచారం, రామచంద్రాపురం, వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రులు, నిజామాబాద్, సిర్పూర్-కాగజ్‌నగర్, జీడిమెట్ల డయాగ్నస్టిక్ సెంటర్లతో పాటు 71 డిస్పెన్సరీల్లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారాయి. రోజువారీగా వాడే సాధారణ మందులతో పాటు, అత్యవసర మందులు ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం కనీస స్థాయి మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈఎస్ఐపై ఆధారపడే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మందులను ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది ఆర్థికంగా వారిని మరింత కుంగదీస్తోంది. డెంగ్యూ, మలేరియా వంటి రక్త పరీక్షలకు అవసరమైన ల్యాబ్ కిట్లు, ఎక్స్‌రే ఫిల్ములు లేక రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. టెస్టింగ్ కిట్ల కొరత, సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో వైద్య సేవల నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోందని అక్కడి వైద్యులే చెబుతున్నారు.
ఖాళీ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1200కు పైగా వివిధ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్ల పోస్టులు 50 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో వైద్య సేవలు సరిగా అందకపోవడంతో ఈఎస్ఐ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతోంది. ఇటీవల 599 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్టు మంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే 247 స్టాఫ్ నర్సులను నియమించారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ సర్జన్లు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని త్వరలో నియమిస్తామని తెలిపారు. అయితే, 1200 ఖాళీల్లో కేవలం 600 మందికి 107 జీవో ఇచ్చి, 247 మందిని భర్తీ చేసి, మిగిలినవి త్వరలో అనడం విచిత్రంగా ఉందని చందాదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
కార్మికుడి హక్కుగా ఈఎస్ఐ సేవలు
ఈఎస్ఐ సేవలు పొందడం కార్మికుడి హక్కు. ఈ ఆస్పత్రుల్లో సేవలు పొందడానికి ప్రైవేటు ఉద్యోగులు, సిబ్బంది వేతనంలో నుంచి 0.25 శాతం, యజమాని వాటా నుంచి 3.25 శాతం ప్రతి నెలా ఈఎస్ఐ కార్పొరేషన్‌కు చెల్లిస్తారు. ఈ నిధులతోనే దేశవ్యాప్తంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా కార్మికులు ప్రమాదాలకు గురైనా, జబ్బుపడినా పరిహారం చెల్లిస్తారు. ఈఎస్ఐసీలో దేశవ్యాప్తంగా 3.80 కోట్ల మంది కార్మికులుండగా, రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నారు. వైద్య సేవలు పొందే కార్మిక కుటుంబాలు మరో 75 లక్షల మంది ఉన్నారు.












