*🇮🇪💐🙏 (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
యువతను మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి తమ వలలోకి లాగుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గంజాయి వినియోగం, అక్రమ సాగు, రవాణా, విక్రయాలు ప్రజారోగ్యం, కుటుంబ వ్యవస్థ, విద్య, ఉపాధి, సామాజిక భద్రతకు తీవ్రమైన సమస్యగా మారుతున్నాయి. ఈ సమస్యను వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా కుటుంబం, విద్యాసంస్థలు, ప్రభుత్వం, సమాజం సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ద్యారపోగు వెంకటేష్ సూచించారు.
ఒక దేశాభివృద్ధికి రహదారులు, భవనాలు, పరిశ్రమలు ఎంత ముఖ్యమో.. ఆ దేశ యువత భవిష్యత్తు అంతకంటే ముఖ్యమైనది. అయితే నేటి సమాజంలో యువతను మత్తు పదార్థాలు క్రమంగా తమ వలలోకి లాగుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గంజాయి వినియోగం, అక్రమ సాగు, రవాణా, విక్రయాలు కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా ప్రజారోగ్యం, కుటుంబ వ్యవస్థ, విద్య, ఉపాధి, సామాజిక భద్రతకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా మారుతున్నాయి.
గంజాయి వినియోగం అలవాటుగా మారినప్పుడు వ్యక్తి చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల గంజాయి సమస్యను కేవలం వ్యక్తిగత అలవాటుగా చూడటం సరైనది కాదు.
ఒక యువకుడు మత్తుకు బానిసైతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది. తల్లిదండ్రుల ఆశలు, కుటుంబ ఆర్థిక స్థిరత్వం, తోబుట్టువుల భవిష్యత్తు, కుటుంబ గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా కుటుంబం, విద్యాసంస్థలు, ప్రభుత్వం, సమాజం సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు వారి ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు ఎందుకు వస్తున్నాయి చదువుపై లేదా పనిపై ఆసక్తి ఎందుకు తగ్గుతోంది అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. అయితే వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, ఒంటరితనం వంటి కారణాలు యువతను మత్తు వైపు నడిపించకుండా కుటుంబం వారికి అండగా నిలవాలి.
విద్యాసంస్థలు కేవలం పాఠ్యాంశాలను బోధించే కేంద్రాలుగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికలుగా ఉండాలి. గుడికి బడికి దూరంగా మద్యం దుకాణాలకు ఉన్న నిబంధనలను పాన్ షాపులు, బడ్డీ కొట్లకు కూడా ఆ నిబంధనలు అమలు చేయాలి.
మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మానసిక ఒత్తిడి, స్నేహితుల ఒత్తిడి, మత్తు పదార్థాల ప్రలోభాలను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు తెలియజేయాలి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శకత్వం వంటి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. యువత సృజనాత్మక కార్యకలాపాల్లో నిమగ్నమైతే మత్తు పదార్థాల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలను తగ్గించవచ్చు.
గంజాయి వినియోగించే వారిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరిపోదు. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది ఎవరు సరఫరా చేస్తున్నారు ఎక్కడ నిల్వ చేస్తున్నారు ఎవరికి విక్రయిస్తున్నారు ఎక్కడ అక్రమంగా సాగు చేస్తున్నారు అనే అంశాలపై పోలీసులు, సంబంధిత ప్రభుత్వ శాఖలు సమన్వయంతో దృష్టి సారించాలి. చిన్న స్థాయి విక్రేతలపై మాత్రమే చర్యలు తీసుకుని, వారి వెనుక ఉన్న పెద్ద సరఫరా నెట్వర్క్లను వదిలేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. సరఫరా గొలుసును ఛేదించడం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, క్షేత్ర స్థాయిలో గంజాయి సాగు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడే కట్టడి చేయడం అత్యంత కీలకం.












