ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఎటువంటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో త్రాగునీటి అంశంపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. గతంలో నీటి సమస్యలు తలెత్తిన ప్రాంతాలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపాలని సూచించారు. రోజువారీ నీటి సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే, తక్షణమే పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
కడెం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతూ, వేసవికాలం ముగిసేలోపు ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, ఇరిగేషన్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా జరిగేలా చూడాలని యంత్రాంగం స్పష్టం చేసింది.








