నిర్మల్ జిల్లాలో సిఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయని మిల్లులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సిఎంఆర్ డెలివరీ ప్రక్రియపై అధికారులతో కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష నిర్వహించారు. మిల్లులకు కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, వెనుకబడిన మిల్లులు పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు.
మిల్లర్ల వారీగా సిఎంఆర్ వివరాలను సమీక్షించిన కలెక్టర్, అన్ని మిల్లులలో రికార్డులను పక్కాగా నిర్వహించాలని, దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రక్రియలో అలసత్వం వహిస్తే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ధాన్యం సంచుల నిల్వ కోసం తగిన గోదాములు, ఇతర ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, రైస్ మిల్లర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.








