తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ కీలక భేటీలో యాసంగి రైతు భరోసా నిధుల విడుదల, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు, వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు, ఉద్యోగుల క్యాష్‌లెస్ వైద్యం, పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరగనుంది.
రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుతోపాటు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగుల క్యాష్‌లెస్ వైద్యం కోసం 1.5 శాతం విరాళం చెల్లింపు, విధివిధానాలు, ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. విద్యా, సహకార రంగాల బలోపేతానికి వీలుగా రెసిడెన్షియల్ స్కూల్స్, డీసీసీబీ భవన నిర్మాణాలకు, పలు ఇతర సంస్థలకు అవసరమైన భూముల కేటాయింపులపై మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.
నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చే హెచ్ఎంఆర్ఎల్ మెట్రో టేకోవర్ పురోగతి, అదనపు బోగీల ఏర్పాటు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై లోతైన చర్చ జరగనుంది. అలాగే, దేవాదుల ప్యాకేజీ-3 పనుల కొనసాగింపునకు అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను ఆమోదించనున్నారు. కొత్తగా ఏర్పాటైన 3 కార్పొరేషన్లలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబడుల అంచనాలను బేరీజు వేసుకుంటూ వార్షిక బడ్జెట్ రూపకల్పనపై చర్చించనున్నట్టు తెలిసింది. దీనికి తగ్గట్టుగా మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.


