నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శాంతి, భద్రతల పరిరక్షణకు సంబంధించి శాంతి కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు.
సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం కొనసాగించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. పండుగలు, ముఖ్య కార్యక్రమాల సమయంలో పరస్పర సహకారం, చట్టపాలనకు కట్టుబాటు అవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్మూర్‌కు చెందిన ముఖ్య నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజలలో అవగాహన పెంచుతూ శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని వారు పిలుపునిచ్చారు.
శాంతి కమిటీ సమావేశం ద్వారా సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇలాంటి సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచనలు వెలువడ్డాయి.


