విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్ 12(1)(C) ప్రకారం, ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా కేటాయించే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్ డిమాండ్ చేశారు.
బుధవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ఈ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్లు నిర్వహిస్తే అవకతవకలకు తావు ఉండదని తెలిపారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన పటేల్, ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని, అక్రమ బ్రాంచీలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించి, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
బీసీ గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, సొంత భవనాలు, నాణ్యమైన భోజనం, భద్రత, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. హాస్టళ్లలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు సమయానికి విడుదల చేయాలని, ప్రతి జిల్లాలో విద్యా హక్కు చట్టం అమలుపై ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.












