తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న నిర్మల్ జిల్లా, భైంసా, ముధోల్ నియోజకవర్గాల అమరులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, వారికి ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం వెంటనే అందించాలని టీజేఏసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు సుదర్శన్ మార్వాడి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను గుర్తింపు కమిటీ ద్వారా తొలి ప్రాధాన్యంతో గుర్తించి, ప్రభుత్వం ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన ఐదుగురు అమరులలో ఇద్దరికి మాత్రమే అప్పటి తెరాస ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించగా, మిగిలిన ముగ్గురు అమరుల కుటుంబాలకు ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని పేర్కొన్నారు. దీంతో నాంపల్లి భాస్కర్ (సోనార్ గల్లి, భైంసా), తోపాయి రవి (కొర్బగల్లి, భైంసా), సల్లెందుల యోగేష్ (కొర్బగల్లి, భైంసా) కుటుంబాలకు కూడా సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసు కేసులు నమోదైన ఉద్యమకారులు, బైండోవర్కు గురైన వారు, జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిని అధికారికంగా గుర్తించి, వారికి కూడా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు, తగిన గౌరవం కల్పించాలని కోరారు. అప్పటి తెరాస ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించిన అమరులు పాపిన్వార్ శైలేందర్ (పురానా బజార్, భైంసా), పద్దె గంగాధర్ (పిప్రి గ్రామం, లోకేశ్వరం మండలం)లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సేవలను స్మరించుకుని నివాళులర్పించారు.
ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రచయితల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జాధవ్ పుండలిక్ రావు, జిల్లా కార్యదర్శి చాకేటి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.











