పెద్దపల్లి, జులై 07
పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న సింగిల్ విండో సీఈఓ మామిడాల అశోక్ కుమార్ (48) పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా ఉద్యోగులు విధుల్లోనే గుండెపోటుతో కుప్పకూలి మరణించడం వంటి విషాదకర సంఘటనలు ప్రతిరోజూ ఏదో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి.
దీనిలో భాగంగానే మంథని సింగిల్ విండో సీఈఓ మామిడాల అశోక్ కుమార్ (48) గుండెపోటుతో ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు. రోజువారీగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అది గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
విధి నిర్వహణలో నిరంతరం సతమతమవుతూ, సకాలంలో విశ్రాంతి లేకపోవడంతో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని సహోద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. సీఈఓ మామిడాల అశోక్ అకాల మృతి పట్ల తోటి సహకార సంఘాల కార్యదర్శులు, సిబ్బంది మరియు స్థానిక రైతాంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












