నిర్మల్ పట్టణంలోని శ్యామ్‌గడ్ సమీపంలో జరిగిన హత్య కేసులో నిర్మల్ టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిర్మల్ పట్టణ శివారులోని శ్యామ్‌గడ్ సమీపంలో కోట వెనుక ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాలు, ఏఎస్పీ సాయి కిరణ్ పర్యవేక్షణలో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతుడు గజానంద్తో పాటు గుపాల్వాడ్ శ్రీనివాస్, వెంకటేష్, రాజు అనే వ్యక్తులు తిరుమల అనే మహిళతో అక్రమ సంబంధాలు కొనసాగించినట్లు తేలింది. ఈ విషయం బయటపడటంతో గజానంద్ తరచూ మిగతా వారితో గొడవలకు దిగేవాడని, ఇది హత్యకు దారితీసిందని తెలిపారు.
తేదీ 24-03-2026న నిందితులు గజానంద్‌కు మద్యం తాగించి, కోట వెనుక ప్రాంతానికి తీసుకెళ్లి కట్టెలతో, బీరు సీసాలతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని నీటి గుంతలో పడవేసి పారిపోయారు. మృతుడి మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు తిరుమల, గుపాల్వాడ్ శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. వెంకటేష్, రాజు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. చిన్నచిన్న వివాదాలను హింసాత్మక మార్గాల్లో పరిష్కరించుకోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు.












