షాద్నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 08
వ్యవసాయ రంగాన్ని మరింత విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం నూతనంగా ఎంపిక చేసిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ల వ్యవస్థ ద్వారా నియోజకవర్గంలో రైతులకు సేవలు మరింత విస్తృతం కానున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎంపికైన పలువురిని సన్మానించారు.
వ్యవసాయ రంగాన్ని మరింత విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం నూతనంగా ఎంపిక చేసిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ల వ్యవస్థ ద్వారా నియోజకవర్గంలో రైతులకు సేవలు మరింత విస్తృతం కానున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎంపికైన ఆరుగురు చైర్మన్లు, ఆరుగురు వైస్ చైర్మన్లు, 74 మంది డైరెక్టర్లను ఆయన ఘనంగా సన్మానించారు.
నిజమైన నాయకులకే అవకాశం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు సేవలందించేందుకు సింగిల్ విండో చైర్మన్లను ఎంపిక చేశామని, నిజమైన, నికార్సైన నాయకులకు అవకాశాలు దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి అదనపు వన్నెలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పీఏసీఎస్ సొసైటీల ఏర్పాటు
గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రైతుల కోసం పీఏసీఎస్ సొసైటీలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. తద్వారా వ్యవసాయదారుల పేర్లను నమోదు చేసి, రుణాల విషయంలోనూ, సబ్సిడీల విషయంలోనూ వారికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రైతులు వారి అవసరాలకు అనుగుణంగా సబ్సిడీ వస్తువులు, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ పనిముట్లు, సబ్సిడీ ఎరువులు పొందేందుకు ఈ సొసైటీలు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు.
సొసైటీల పనితీరుపై సమీక్ష
నియోజకవర్గంలో సొసైటీల పనితీరు బాగుందని, నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి రైతులకు సహకారం అందించాలని సూచించారు. కొందుర్గు మండలంలో దామోదర్ రెడ్డి, షాద్నగర్, చేగూరు, మేకగూడ సొసైటీలలో సభ్యులు బాగా పనిచేస్తున్నారని ఆయన అభినందించారు. అయితే నందిగామ ఈ విషయంలో కొంతమేర వెనుకబడి ఉందని, దీనిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిగతా సొసైటీలన్నీ రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు.
నిరంతర రైతు సంప్రదింపులు అవసరం
కొత్తగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేషన్ ద్వారా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం వ్యవసాయ రంగంలో పెను మార్పులకు కారణమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. నాయకులుగా మేము అప్పుడప్పుడు అందుబాటులో ఉంటాం. కానీ సొసైటీ సభ్యులు మాత్రం నిరంతరం రైతులకు అందుబాటులో ఉండాలి. విత్తనాలు నాటే దగ్గర నుంచి పంట చేతికి అందించి, మార్కెట్కు తరలించే వరకు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థాయిలో రైతులకు సహకారం అందించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.












