** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కేవలం అధికార వ్యవస్థ కాదని, ప్రజలకు జవాబుదారీగా, పారదర్శకంగా ఉండాలని సీహెచ్.వి. ప్రభాకర్ రావు అన్నారు. ఎన్నికల్లో గెలుపు అధికారాన్ని ఇస్తుందని, అయితే ఆ అధికారానికి నైతికత, చట్టబద్ధత, ప్రజల విశ్వాసాన్ని జవాబుదారీతనం, సమర్థ పాలనే కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే హక్కును ప్రజలు ఎప్పటికీ వదులుకోరని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతే ప్రజాస్వామ్యానికి ప్రాణమని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కేవలం అధికారాన్ని వినియోగించే వ్యవస్థ కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండే, పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎన్నికల్లో గెలవడం అధికారాన్ని ఇస్తుంది. కానీ ఆ అధికారానికి నైతికతను, చట్టబద్ధతను, ప్రజల విశ్వాసాన్ని కల్పించేది జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలన మాత్రమే. ప్రజలు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తారు, కానీ ప్రశ్నించే హక్కును ఎప్పటికీ వదులుకోరు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతే ప్రజాస్వామ్యానికి అసలు ప్రాణం.
ఇటీవలి కాలంలో దేశంలో ఏదైనా పెద్ద వివాదం జరిగినప్పుడల్లా కొత్త చట్టాలను తీసుకురావడం ప్రభుత్వాల సహజ ప్రతిస్పందనగా మారింది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌లు, నియామకాలలో అవకతవకలు, ఆర్థిక నేరాలు, మహిళలపై దాడులు, సైబర్ నేరాలు... ప్రతి సమస్యకు కొత్త చట్టమే పరిష్కారమన్న భావన పెరుగుతోంది. కానీ ప్రజలు అడుగుతున్న అసలు ప్రశ్న వేరేది. ఇప్పటికే ఉన్న చట్టాలను ఎంత సమర్థంగా అమలు చేశాం? నేరం చేసినవారిని ఎంత వేగంగా శిక్షించాం? ప్రభుత్వ యంత్రాంగం ఎంత నిజాయితీగా పనిచేసింది? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించకపోతే కొత్త చట్టాలు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించలేవు. నేరాలను అరికట్టేది కేవలం కఠిన శిక్షలు కావు, తప్పు చేసినవారిని తప్పకుండా చట్టం శిక్షిస్తుందనే నమ్మకం. అదే ప్రజాస్వామ్యంలో న్యాయపాలనకు పునాది.
పరీక్షలలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం తీసుకొచ్చింది. ప్రశ్నాపత్రాల లీక్‌లు, పరీక్షల్లో మోసాలు, నిర్వాహకుల కుమ్మక్కు వంటి అక్రమాలను అరికట్టడమే దీని ఉద్దేశం. కఠిన శిక్షలు, భారీ జరిమానాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ చట్టం వచ్చిన తర్వాత కూడా వివిధ పరీక్షలపై వివాదాలు కొనసాగితే ప్రజల్లో సహజంగానే ఒక సందేహం తలెత్తుతుంది. సమస్య చట్టంలో ఉందా? లేక అమలులో ఉందా? దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ వంటి ప్రవేశ పరీక్షలపై తలెత్తిన వివాదాలు, ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణలు, అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టడం, ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, ఇవన్నీ పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కుదిపేశాయి. ప్రతి విద్యార్థి తన ప్రతిభతోనే ముందుకు రావాలని కోరుకుంటాడు. కానీ పరీక్షా ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తమైతే, దెబ్బతినేది కేవలం ఒక పరీక్ష కాదు, మొత్తం వ్యవస్థపై నమ్మకం.
అదే విధంగా మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వ్యాపం (వ్యావసాయిక్ పరీక్ష మండల్ – Vyavsayik Pariksha Mandal) కుంభకోణం భారతదేశంలో పరీక్షా వ్యవస్థ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటి. వైద్య విద్య ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో అక్రమాల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అంటే కేవలం తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయడం కాదు. తప్పు ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మళ్లీ జరగకుండా ఎలాంటి సంస్కరణలు చేపట్టారు? అనే ప్రశ్నలకు ప్రజల ముందే సమాధానం చెప్పడం. ప్రభుత్వం చేసే ప్రతి పని చట్టబద్ధమే కావచ్చు. కానీ చట్టబద్ధతతో పాటు ప్రజల విశ్వాసాన్ని కూడా సంపాదించాలి. ప్రభుత్వ నిధులు, ప్రత్యేక నిధులు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, నియామక వ్యవస్థలు-ఇవన్నీ సాధ్యమైనంత పారదర్శకంగా ఉండాలి. సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రశ్నలకు సమాధానం చెప్పే సంస్కృతి పెరగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సమాచారం దాచడం అనుమానాలకు దారితీస్తుంది, సమాచారం పంచుకోవడం విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే పాలకులు కాదు, ప్రజల సేవకులు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ప్రజలదే.












