** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
ప్రస్తుత మోడీ పాలనలో భారతదేశం పలు అంతర్జాతీయ సూచీల్లో వెనుకబడిపోయిందని, ప్రభుత్వాలు, సమాజంలో నైతికత లోపించిందని ప్రొ. దేవరాజు మహారాజు విమర్శించారు. నీట్ పేపర్ లీకులు, విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రభుత్వ చర్యలకు నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) ఆధ్వర్యంలో జరిగిన యువత ఉద్యమం బీజేపీ అహంకారాన్ని నేలమట్టం చేసిందని ఆయన తెలిపారు.
ప్రభుత్వంలో ఉండి అధికారం చలాయిస్తున్న వారే కాదు, సమాజంలో సామాన్య పౌరులు కూడా నైతికత లేకుండా అవినీతికి, మోసానికి పాల్పడుతున్నారని, తాత్కాలిక ప్రయోజనాల కోసం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రొ. దేవరాజు మహారాజు విమర్శించారు. నీతి, నిజాయితీ లోపించడం, ఓటుకు డబ్బులు తీసుకోవడం వంటివి సమాజాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత మోడీ పాలనలో భారతదేశం అంతర్జాతీయ సూచీల్లో వెనుకబడిపోయిందని, వైద్య సదుపాయాల లభ్యతలో 193, పత్రికా స్వేచ్ఛలో 151, మానవాభివృద్ధిలో 130, ప్రపంచ ఆకలి సూచిలో 102, అవినీతి ర్యాకింగ్‌లో 91వ స్థానాల్లో ఉన్నాయని తెలిపారు.
2002లో సుప్రీంకోర్టు మానవత్వానికి ప్రమాదకారులుగా పేర్కొన్న వ్యక్తులను ప్రజలు ఎన్నుకోవడం, 'ఇండియా టుడే' పత్రిక నరేంద్ర మోడీని 'విద్వేషపు హీరో' అని, 'తెహల్కా' పత్రిక అమిత్ షాను ప్రశ్నించడం వంటి పరిణామాలను ప్రొ. మహారాజు ప్రస్తావించారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో పేపర్ లీకులు, నీట్ పరీక్షల వైఫల్యం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, విద్యార్థుల ర్యాలీపై లాఠీచార్జి, బాష్పవాయువు, ఫెల్లెట్ గన్స్ వాడకం, పోలీసుల దుశ్చర్యలు జలియన్ వాలా బాగ్ దుర్ఘటనను గుర్తుకు తెచ్చాయని ఆయన అన్నారు. యువత ఆత్మవిశ్వాసం, సహనం, రాజ్యాంగ స్ఫూర్తి ముందు కేంద్ర ప్రభుత్వమే మోకాళ్లపై కూర్చుందని, యువత దేశాన్ని పునరుద్ధరిస్తుందనే విశ్వాసం కలిగిందని చెప్పారు.
మంత్రివర్గంలోని ఇతర మంత్రుల వైఫల్యాలను కూడా ఆయన ఎత్తిచూపారు. విదేశాంగ విధానం, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు, భూ కుంభకోణాలు, అయోధ్య రామాలయ విరాళాల స్వాహా వంటి అంశాలపై విమర్శలు గుప్పించారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారనే ప్రచారాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణమంత్రి, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులే అయినప్పుడు, హిందువులకు రక్షణ కల్పించలేకపోతే అధికారంలో ఎందుకు కొనసాగాలని ఆయన నిలదీశారు. 'మోడీ అంటే మోసం, బీజేపీ అంటే వినాశనం' అనే భావన యువతకు అర్థమైందని అన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్, పి.యం. కేర్స్, నమామి గంగే, స్మార్ట్ సిటీ మిషన్, అదానీ-హిండెన్ బర్గ్ సమస్య, వ్యాపం, సెబీ, మోహన్ యాదవ్ ఉజ్జయిని, అయోధ్య రామాలయ విరాళాలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ, కోవిడ్-19 వైద్య పరికరాలు, మందుల సరఫరా వంటి అనేక అంశాలలో మోసాలు, అవినీతి జరిగాయని ఆయన ఆరోపించారు. అధికారంలో కొనసాగడమే విధానంగా ఉన్న బీజేపీ అహంకారాన్ని యువత బద్దలు కొట్టిందని, ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే మార్పు సాధ్యమవుతుందని చెప్పారు.
బోస్టన్ యూనివర్సిటీ స్కాలర్ అభిజీత్ దీప్కె 'కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి)'ని రూపొందించి, ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతను ఆకర్షించి, నీట్ పేపర్ లీక్ పై పోరాడి, కేంద్ర విద్యామంత్రి రాజీనామాకు పట్టుబట్టారని తెలిపారు. సోనమ్ వాంగ్ చుక్ వంటి మేధావుల మద్దతుతో సిజెపి ఉద్యమానికి ఊపొచ్చిందని, ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. యువ నిరసనకారులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం వంటి చర్యలు తీసుకున్నప్పటికీ, యువత ఆత్మవిశ్వాసం ముందు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మంత్రులతో చర్చల అనంతరం సిజెపి సభ్యులు సంతృప్తి చెందలేదని, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిని తొలగించాలని, బాధితుల కుటుంబాలకు పరిహారం, గాయపడిన వారికి వైద్యం, అక్రమ కేసుల కొట్టివేత వంటి డిమాండ్లు నెరవేరాయని తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ అఖండ విజయం సాధించిందని, దేశ యువత ప్రస్తుత ప్రభుత్వాన్ని లొంగదీసుకున్నందుకు గర్వపడాలని అన్నారు.












