మిర్యాలగూడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ పఖ్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిడిపిఓ రేఖల మమత సూచించారు. ఈ పఖ్వాడలో భాగంగా చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించారు.
ఈ నెల 9 నుండి 23 వరకు జరుగుతున్న పోషణ్ పఖ్వాడలో భాగంగా, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 0 నుండి 6 సంవత్సరాల పిల్లల ఆరోగ్యం, చిరుధాన్యాలు, పోషకాహారాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు.
సిడిపిఓ మమత మాట్లాడుతూ, తల్లి, బిడ్డల పోషణ, పిల్లల మెదడు అభివృద్ధికి ప్రారంభ దశలో ఇచ్చే ఉద్దీపన, ఆటల ద్వారా విద్య, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వంటి అంశాలలో తల్లిదండ్రులు, సమాజం క్రియాశీలకంగా ఉండాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి సమాజ భాగస్వామ్యం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల మద్దతును కూడా ఆమె ఆహ్వానించారు.
అంగన్వాడీ కేంద్రాలలో థర్డ్ పార్టీ రిపోర్టింగ్ (TCHR), పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ (Growth Monitoring), కౌన్సెలింగ్ వంటి సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జె. వెంకట్ రెడ్డి, తహసీల్దార్ పి. శ్రీనివాస్, ఎంపీడీఓ ఎం. శేషగిరిశర్మ, ఎంపీఓ ఎం. రమేష్, ఎస్ఐ ఎం. లక్ష్మయ్య, ఎంఈఓ డి. ధర్మానాయక్, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్, పంచాయితీ కార్యదర్శులు, సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.








