హైదరాబాద్, జులై 15
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాద్ రానున్నారు. ముంబైలోని ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి కోలుకోవడానికి 60 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాద్ చేరుకోనున్నారు. ముంబైలోని కోకిలబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు.
ఈ నెల 11న ఆయన కుడి భుజంలోని షోల్డర్ రొటేటర్ కఫ్ సమస్యకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను చేపట్టింది.
శస్త్రచికిత్స అనంతరం నాలుగు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. ఆయన రేపు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పూర్తి కోలుకునేందుకు సుమారు 60 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అలాగే ప్రతిరోజూ కుడి చేతికి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత రెండు నెలల అనంతరం ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.
కాగా, పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు ఏపీ మంత్రులు, జనసేన నేతలు, ఇతర పార్టీల నేతలు కూడా ఆయన్ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.












