రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు నిర్మల్ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోందని, వివిధ శాఖల అధికారులు చేపట్టిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పంచాయతీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించామన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు కూడా విజయవంతంగా సాగాయని పేర్కొన్నారు.
నిర్దేశిత ప్రణాళిక ప్రకారం అన్ని కార్యక్రమాలు లక్ష్యాల మేరకు పూర్తి చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.








