నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరిగాయని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కలెక్టర్ భవేశ్ మిశ్రా ధాన్యం కొనుగోళ్లపై సమగ్ర నివేదికను వెల్లడించారు. జిల్లాలో 1,58,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 1,75,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేశామని తెలిపారు.
30,000 మెట్రిక్ టన్నుల జొన్న పంట దిగుబడి రాగా, అందులో 20,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, మిగిలిన కొద్దిపాటి ధాన్యాన్ని మరో మూడు రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
రానున్న పంట కాలానికి ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం 10,734 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు యూరియా బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాల వద్ద ధరల పట్టికను ప్రదర్శిస్తామని, అధిక ధరలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పలు దుకాణదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు.









