జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలని, నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇతర రెవెన్యూ అంశాలపై కూడా ఆయన అధికారులతో సమీక్షించారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణా, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, ప్రజావాణి, ఎస్ఐఆర్ ఓటర్ ప్రోజెని మ్యాపింగ్, సెల్ఫ్ ఎన్యుమరేషన్ వంటి పలు రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను కఠినంగా అరికట్టాలని, నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అక్రమ రవాణాపై నియంత్రణ ఉంచడంలో ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇతర రెవెన్యూ వ్యవహారాలపై మాట్లాడుతూ, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ కు సంబంధించి ఓటర్ ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఆక్విజిషన్ నాయక్వాడి జల కుమారి, సిపిఓ జీవరత్నం, ఏడి మైన్స్ హరి ప్రసాద్, ఏడి ల్యాండ్ సర్వేయర్ నరసింహ మూర్తి, తహసిల్దార్ లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












