జనగణన శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు నిబద్ధతను చాటుకున్నారు. బుధవారం మిర్యాలగూడలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో, రిప్రెష్మెంట్ కోసం అందించిన పేపర్ టీ కప్ లను వాడటానికి సున్నితంగా నిరాకరించి, స్వయంగా తెచ్చుకున్న స్టీల్ గ్లాస్ లలో టీ తాగారు.
మిర్యాలగూడ ప్రాథమికోన్నత పాఠశాల గాంధీ పార్క్ లో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో, పర్యావరణ పరిరక్షణపై ఉపాధ్యాయులు తమకున్న మమకారాన్ని ప్రదర్శించారు. పేపర్ కప్ లకు బదులుగా స్టీల్ గ్లాస్ లను ఉపయోగించడం ద్వారా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే సందేశాన్ని వారు పరోక్షంగా అందించారు.
ఈ వినూత్న కార్యక్రమానికి ఉపాధ్యాయులు జొన్నలగడ్డ ఇందిర, దండా ఉమారాణి, మచ్చ రఘు, రజియా బేగం, కస్తూరి రవీందర్, దీరావత్ శైలజ, దిరావత్ లక్ష్మీబాయి, పార్వతి తదితరులు చొరవ చూపారు. వీరితో పాటు శిక్షణలో పాల్గొన్న అనేకమంది ఉపాధ్యాయులు ఈ పర్యావరణహిత పద్ధతిని అనుసరించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం, ఆరోగ్య సమస్యలను నివారించడం వంటి అంశాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ మార్పు ప్రతి వ్యక్తి జీవితంలో, శుభకార్యాల వంటి సందర్భాలలోనూ విస్తరించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు.
జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెన్సస్ శిక్షణలో స్టీల్ గ్లాస్ లను ఉపయోగించిన ఉపాధ్యాయులను అభినందించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.












