నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో గల కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా భూమాతను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై ఉప అటవీ అధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
భూగోళం సమస్త జీవరాశులకు ఆధారమని, ప్రకృతి అందాలతో మానవాళికి జీవనోపాధి కల్పిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నేల నిస్సారమవడం, ప్రకృతి వనరుల విధ్వంసం, వాతావరణ మార్పులు వంటివి భూమాతకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్ తరాల కోసం పుడమినీ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నొక్కి చెప్పారు. భూమి కాలుష్యం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలను విద్యార్థులకు అందించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా భూమాతకు మేలు జరుగుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్.ఓ అన్నపూర్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు వెన్నెల, సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.








