కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిరణ్ మోడర్న్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి గ్రామపంచాయతి పరిధిలోని ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పండ్ల మొక్కలు నాటడం, వ్యాస రచన, చిత్రలేఖనం వంటి పోటీలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఈ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ వేముల సాయికిరణ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని, చెట్లు నాటడం, నీటిని పొదుపుగా వాడటం వంటి మంచి అలవాట్లను విద్యార్థులు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.
పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన మెరుగుపడిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.












