చిత్తూరు, 2026-06-05
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమపాతం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలతో భారీ జల ప్రళయం ఏర్పడింది. ఈ విపత్తులో ప్రాథమిక అంచనాల ప్రకారం 95 మందికి పైగా మరణించారని, వందలాది మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. ఈ ఘటనతో భోటే కోషి, త్రిసూలీ నదులు ఉప్పొంగి ప్రవహించాయి.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమపాతం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలతో భారీ జల ప్రళయం ఏర్పడింది. ఈ విపత్తులో ప్రాథమిక అంచనాల ప్రకారం 95 మందికి పైగా మరణించారని, వందలాది మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమపాతం నుంచి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ఈ విలయం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో భోటే కోషి, త్రిసూలీ నదులు ఒక్కసారిగా పోటెత్తి, ఉధృతంగా ప్రవహిస్తూ నదీ తీర ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. కనీసం వంద మంది దాకా మృతి చెందగా, వందల సంఖ్యలో పర్యాటకులు, స్థానికులు ఆచూకీ లేకుండా పోయారని సమాచారం. ఇలా గల్లంతైన వారిలో వందకు పైగా భారతీయులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
భారీ ఆస్తి నష్టం
ఈ ఆకస్మిక వరదలతో ప్రాణ నష్టంతో పాటు భారీ ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది. రోడ్లు, వంతెనలు, పెద్ద ఎత్తున భవనాలు, హోటళ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు సైతం వరద నీటిపాలయ్యాయి. ఈ ఆకస్మిక వరదల నేపథ్యంలో రెస్క్యూ టీమ్‌లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారత్ అప్రమత్తం
మరోవైపు, భారత్ కూడా అప్రమత్తమైంది. నేపాల్‌లోని త్రిసూలీ పరివాహక ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో హై అలర్ట్ జారీ చేశారు. టిబెట్ సరిహద్దు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషి నదికి పొంగిపొర్లిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్‌లో దాదాపు 500 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. ఆకస్మిక వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఇప్పటివరకు 46 మృతదేహాలను వెలికితీసినట్లు భద్రతా అధికారులు తెలిపారు.
గల్లంతైన విదేశీయులు
ప్రభావిత ప్రాంతాలలోని వివిధ భాగాల నుండి కనీసం 93 మందిని రక్షించినట్లు అధికారులు చెప్పారు. గల్లంతైన వారిలో కనీసం 105 మంది భారతీయులు, 37 మంది ఎన్నారైలు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో చాలా మంది టిబెట్‌లోని కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. గల్లంతైన విదేశీయులు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో సహా పలు దేశాలకు చెందినవారని అధికారులు చెబుతున్నారు.
భూకంపం కారణమా
ప్రాథమిక సమాచారం ప్రకారం, భూకంపం కారణంగా సంభవించిన హిమపాతం వల్ల కరిగిన మంచు నీరు భోటే కోషి నదిలోకి ప్రవహించి ఈ ఆకస్మిక వరదను సృష్టించిందని భావిస్తున్నారు. భోటే కోషి నదిలో వచ్చిన ఈ ఆకస్మిక వరదలు రసువా ప్రాంతంలో తీవ్ర అంతరాయాన్ని కలిగించాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని పర్యాటకులు, ఇతర ప్రజల భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి. అధికారులు, సహాయక సంస్థలు పరిస్థితిని అంచనా వేయడానికి, గల్లంతైన వారి ఆచూకీని కనుగొనడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. నేపాల్ టూరిజం బోర్డు, పర్యాటకులు, వారి కుటుంబాలు సమాచారం లేదా సహాయం కోరడానికి అత్యవసర సంప్రదింపు నంబర్లను కూడా జారీ చేసింది.












