ఫరూక్ నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 14
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఈజీఎస్) కింద మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన చెక్కుల విడుదల కోసం లంచం డిమాండ్ చేశారని మొగలిగిద్ద గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ భర్త, ఒక వార్డు సభ్యుడిపై కాంట్రాక్టర్ ఖాజాపాషా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, ఇప్పటికే రూ.4 లక్షలు చెల్లించినా మిగిలిన నిధుల కోసం రూ.6 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఫరూక్ నగర్ ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఈజీఎస్) నిధుల నుంచి మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి చెక్కులు విడుదల చేయడంలో మొగలిగిద్ద గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ భర్త, ఒక వార్డు సభ్యుడు లంచం డిమాండ్ చేశారని కాంట్రాక్టర్ ఖాజాపాషా ఆరోపించారు. ఈ వ్యవహారంలో రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, ఇప్పటికే రూ.4 లక్షలు చెల్లించినా మిగిలిన నిధుల కోసం రూ.6 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఫరూక్ నగర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీకాంత్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పాటు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీపీఓలకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి మంజూరు చేసిన రోడ్లు
గత సంవత్సరం మొగలిగిద్ద గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి, గ్రామ అభివృద్ధిలో భాగంగా రూ.5 కోట్ల విలువైన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంజిఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి కొత్తూరు మండలం, జహంగీర్ పీర్ దర్గాకు చెందిన కాంట్రాక్టర్ ఖాజాపాషా ముందుకు వచ్చారు. ఆయన దాదాపు రూ.4 కోట్ల విలువైన సీసీ రోడ్ల పనులు పూర్తి చేశారు. అయితే, పనులు పూర్తయి చాలాకాలమైనా బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్‌ను గ్రామ సర్పంచ్ బుగ్గ కృష్ణ, ఉప సర్పంచ్ లక్ష్మీ భర్త రాము, వార్డు సభ్యుడు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ లంచం అడిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
మొదటి విడత చెక్కుల కోసం రూ.4 లక్షలు
మొత్తం నిధులపై 30 లంచం అడిగినట్లు, చివరకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ ఖాజాపాషా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా, మొదటి విడతగా రూ.2.88 కోట్ల చెక్కులు మంజూరైనప్పుడు, వాటిని విడుదల చేయడానికి రూ.4 లక్షలు లంచం అడిగారని తెలిపారు. గత్యంతరం లేక, సర్పంచ్ సూచించిన విధంగా వార్డు సభ్యుడు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ ఖాతాలోకి రూ.4 లక్షలు జమ చేసిన తర్వాతే రూ.2.88 కోట్ల చెక్కులు ఆయనకు అందాయని వివరించారు.
రెండో విడత కోసం రూ.6 లక్షలు డిమాండ్
ఇక మిగిలిన పనులు చేపట్టిన తర్వాత, రెండో విడతగా రూ.43 లక్షల నిధులు విడుదలయ్యాయి. అయితే, ఈ రూ.43 లక్షల చెక్కులు ఇవ్వడానికి మరో రూ.6 లక్షలు చెల్లించాలని సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ భర్త రాము, వార్డు సభ్యుడు రెహమాన్ మొండికేశారని బాధితుడు ఆరోపించారు. శుక్రవారం చెక్కులు ఇస్తామని పిలిపించి, డబ్బులు అందలేదని గంటల తరబడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చోబెట్టారని తెలిపారు. సెక్రటరీ సూచనలను కూడా వారు పట్టించుకోలేదని, చెక్కులు ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదని పేర్కొన్నారు.











