హైదరాబాద్, 2026-08-13
తరతరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలకు రీ-సర్వే ద్వారా అయినా శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భూమిని దశాబ్దాలుగా సాగు చేస్తున్నది ఒక కుటుంబం కాగా రికార్డుల్లో మాత్రం మరో వ్యక్తి పేరు ఉండటం, పాత సర్వే నంబర్లు ప్రస్తుత పరిస్థితులకు సరిపోకపోవడం వంటి సమస్యలు రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కొనసాగుతున్నాయి.
తరతరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలకు రీ-సర్వే ద్వారా అయినా శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భూమిని దశాబ్దాలుగా సాగు చేస్తున్నది ఒక కుటుంబం కాగా రికార్డుల్లో మాత్రం మరో వ్యక్తి పేరు ఉండటం, పాత సర్వే నంబర్లు ప్రస్తుత పరిస్థితులకు సరిపోకపోవడం, వారసత్వ మార్పులు నమోదు కాకపోవడం, సరిహద్దులు స్పష్టంగా లేకపోవడం వంటి సమస్యలు రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఒకప్పుడు భూమికి పెద్దగా విలువ లేకపోవడంతో అన్నదమ్ములు, బంధువులు పరస్పర నమ్మకంతో భూములను సాగు చేసుకునేవారు. పట్టా ఎవరి పేరుపై ఉందన్నదానికంటే కుటుంబంలో ఎవరు సాగు చేస్తున్నారన్నదే ముఖ్యంగా ఉండేది. ఇప్పుడు భూముల విలువలు పెరగడం, భూమి ఆధారిత ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రాధాన్యం పెరగడంతో నాటి నమ్మకాలు నేటి వివాదాలుగా మారుతున్నాయి.
వారసత్వ వివాదాలు, రికార్డుల లోపాలు
ఒక కుటుంబం 40 నుంచి 50 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి రికార్డుల్లో పూర్వీకుల లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరుపై ఉండటం, వారసత్వ మార్పులు జరగకపోవడం వల్ల వివాదాలు ఏర్పడుతున్నాయి. రికార్డులో పేరు ఉన్నవారు భూమి తమదేనని చెబుతుండగా, దశాబ్దాలుగా సాగు చేస్తున్నవారు తమకే హక్కు ఉందని వాదిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కేవలం రికార్డులో ఉన్న పేరును చూసి నిర్ణయం తీసుకోకుండా పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, వారసత్వ ఆధారాలు, సాగు చరిత్ర, సరిహద్దులు, భూమి వాస్తవ స్థితిని సమగ్రంగా పరిశీలించాలని రైతులు కోరుతున్నారు.
రీ-సర్వే ఆవశ్యకత
ఇక్కడే రీ-సర్వే కీలకంగా మారుతోంది. భూమి వాస్తవంగా ఎక్కడ ఉంది విస్తీర్ణం ఎంత సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి పాత సర్వే రికార్డులతో ప్రస్తుత భౌగోళిక పరిస్థితులకు తేడా ఉందా ఏ భూమి ఏ సర్వే నంబర్లో ఉంది అనే విషయాలను రీ-సర్వే ద్వారా స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే రీ-సర్వేను కేవలం కొలతలకు పరిమితం చేయకుండా రికార్డుల సమగ్ర పరిశీలనతో అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారు.
యాజమాన్య హక్కులపై చట్టపరమైన విచారణ
ఒకే భూమిపై ఇద్దరు వ్యక్తులు హక్కు కోరుతున్నప్పుడు రీ-సర్వే ద్వారా భూమి స్థానం, విస్తీర్ణం, సరిహద్దులు తేలినా.. యాజమాన్య హక్కు ఎవరిది అనే అంశంపై చట్టపరమైన విచారణ అవసరం. అందువల్ల రీ-సర్వే తర్వాత వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక భూ పరిష్కార బృందాలను ఏర్పాటు చేయాలని రైతులు సూచిస్తున్నారు. తహసీల్దార్, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది, అవసరమైన చోట ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసి ప్రతి కేసును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరుతున్నారు.












