ఖానాపూర్, ఆగస్టు 2026: రాబోయే భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఖానాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ నేతృత్వంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. ఈ ర్యాలీని ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, ఎంఈవో సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యతను చాటుతూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మన దేశభక్తిని చాటేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని యువత ముందుకు వచ్చి, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచాలని విజ్ఞప్తి చేశారు.
దేశ విలీనంలో సర్దార్ పటేల్ పాత్ర
మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి మహనీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని అన్నారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించిందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో, ఆయన దేశాన్ని విస్తరించడంలో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు.
దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరి బాధ్యత
దేశం పరాయి పాలన నుండి విముక్తికి చిత్తశుద్ధితో కృషిచేసి, దేశాన్ని నిలబెట్టిన నాయకులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల ఆశయాలను మరింత దేశ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంఈఓ సంధ్యారాణి అన్నారు.
పార్టీలకు అతీతంగా దేశభక్తి చాటాలి
బీజేపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశాన్ని కాపాడటానికి పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే నేడు ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా జెండాను ఎగరవేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మన దేశభక్తిని చాటాలని అన్నారు.
ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక, బీజేపీ ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు కీర్తి మనోజ్, ఏ.నారాయణ, అంక మహేందర్, తోకల బుచ్చన్న, పడాల రాజా శేఖర్, రవీందర్ రెడ్డి, రాజు, బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











