మిర్యాలగూడ, జూలై 8
మిర్యాలగూడ పట్టణాన్ని పరిశుభ్రంగా, సమస్యల రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ బుధవారం 44, 46, 48వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పరిస్థితులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
మిర్యాలగూడ పట్టణాన్ని పరిశుభ్రంగా, సమస్యల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బుధవారం మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ 44, 46, 48వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవి, 44, 46, 48వ వార్డుల కౌన్సిలర్లు మల్గం రమేష్, బంటు శ్రీనివాస్, పందిరి అనిత, జవాన్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కాలనీలలో డ్రైనేజీల నిర్వహణ, చెత్త సేకరణ, తడి–పొడి వ్యర్థాల వేరు చేయడం, రహదారుల పరిస్థితి, పార్కుల నిర్వహణ, వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలు, మురుగు నీటి ప్రవాహం, పారిశుధ్య పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైన చోట వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని, ప్రతి వార్డులో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు.
ప్రజల సమస్యలకు వెంటనే స్పందించడం, నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడం, ప్రతి వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే మున్సిపాలిటీ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ పేర్కొన్నారు.












