హైదరాబాద్, జులై 06
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వివరణ ఇవ్వాలని ఆయన సవాల్ విసిరారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి లక్షల కోట్ల రూపాయలు నిధులు తెచ్చిందని, కానీ పేదవాడికి ఒక సొంత ఇల్లు కట్టించి ఇవ్వడానికి మాత్రం వారికి మనసు రాలేదని ఆయన మండిపడ్డారు.
ఆ ప్రాజెక్టు కట్టింది వాళ్లే, ఓపెన్ చేసింది వాళ్లే, అది కూలిపోయింది కూడా వాళ్ల హయాంలోనే. ఇప్పుడు కాళేశ్వరం దగ్గరకు పోయి మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచితే కింద ఉన్న ప్రాంతాలన్నీ కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పినా, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టు నిర్మాణంలో అప్పట్లో చిత్తశుద్ధి, నిజాయితీ ఉండి ఉంటే.. ఇప్పుడు దానికి ఈ గతి పట్టేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు.
విపక్షాలు ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే దానికి అసెంబ్లీ వేదిక అవుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలో ఎనిమిదో వింత అని ప్రగల్భాలు పలికిన పెద్దమనిషి కేసీఆర్, అసెంబ్లీకి రావాలి. అసలు కాళేశ్వరం ఎలా కట్టారో సమాధానం చెప్పాలి. మీరు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి. ఇప్పటికైనా సభకు వచ్చి కాళేశ్వరంపై పూర్తి వివరణ ఇవ్వాలి అని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు.











