మహబూబాబాద్, జులై 12
మహబూబాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గూడూరు, ఖానాపురం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, గూడూరు మండలం కోడి చెరువు ప్రాంతంలో చిరుత పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత కొద్ది రోజులుగా మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, ఖానాపురం అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచారం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. గూడూరు మండల పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తించిన పాదముద్రలు ప్రాథమికంగా చిరుతపులివేనని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ రావు ధృవీకరించారు.
రైతులు అందించిన సమాచారం మేరకు, మండల కేంద్రానికి సమీపంలోని కోడి చెరువు ప్రాంతంలో శనివారం సాయంత్రం ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రం వైపు వెళ్తుండగా, పక్కనే ఏపుగా పెరిగిన జీలుగా మొక్కలలో ఏదో శబ్దం చేస్తూ జంతువు కదిలినట్లు గమనించాడు. దీంతో భయపడిన ఆ రైతు, ఆదివారం ఉదయం మరికొందరు రైతులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లగా, అక్కడ కనిపించిన జంతువు పాదముద్రలను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను పరిశీలించి, అవి చిరుతపులికి చెందినవేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో, సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చిరుతపులి కనిపించినా, అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.












