Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ జలపాతం వద్ద భారీ వర్షాల కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు, పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లవద్దని జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ బోబడే (ఐఎఫ్ఎస్) హెచ్చరించారు. అనవసర సాహసాలు ప్రాణాలకు హాని కలిగిస్తాయని ఆయన తెలిపారు.
నిర్మల్ పట్టణానికి సమీపంలోని మహబూబ్ ఘాట్ అడవుల్లో, సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో రానాపూర్ బీట్ పరిధిలో ఉన్న జలపాతాన్ని జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ బోబడే (ఐఎఫ్ఎస్) శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జలపాతంలోకి చేరుతుండటంతో అక్కడ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, పర్యాటకులు జలపాతం వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జలపాతం వద్ద గుమిగూడడం, స్నానాలు చేయడం, సెల్ఫీలు దిగడం వంటి చర్యలు ప్రాణాపాయానికి దారితీసే అవకాశముందని హెచ్చరించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహం ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి సాహసోపేత చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఈ జలపాతం అటవీ ప్రాంతంలో ఉన్నందున అనుమతి లేకుండా ప్రవేశించడం, అటవీ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలపై భారత అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వర్షాకాలంలో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు తమ భద్రతను కాపాడుకోవాలని, అటవీ శాఖ అధికారులకు సహకరించాలని జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ బోబడే విజ్ఞప్తి చేశారు.












