ఖానాపూర్, జూలై 18
ఖానాపూర్ పట్టణంలో ధ్రువ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ వీధుల్లో డప్పులు, సంగీత వాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఖానాపూర్ పట్టణంలోని ధ్రువ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించి, తమ ఇళ్లలో సిద్ధం చేసిన బోనాలను పాఠశాలకు తీసుకువచ్చారు.
అనంతరం డప్పులు, సంగీత వాయిద్యాల నడుమ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బోనాల ఊరేగింపును నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారు, కాళీమాత, చండీమాత తదితర దేవతల వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు. భక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఆకుల విష్ణు మాట్లాడుతూ, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రశాంత్, ఉపాధ్యాయులు ప్రవళిక, నదియా, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.












