ఖానాపూర్, 2023-09-02
ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన పార్కులో విద్యుత్ దీపాలు పనిచేయకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారు. పార్కులో పెరిగిన గడ్డి, దెబ్బతిన్న వ్యాయామ పరికరాలు కూడా సమస్యగా మారాయి.
ఖానాపూర్ పార్కులో అంధకారం.. చీకట్లోనే పట్టణ ప్రజల వాకింగ్
ఖానాపూర్, సెప్టెంబరు 2 (మనోరంజని తెలుగు టైమ్స్): ఖానాపూర్ పట్టణంలోని పార్కులో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కులో చీకటి నెలకొనడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు సైతం ఇబ్బందులు పడుతున్నారని వాకింగ్‌కు వచ్చే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణ ప్రజలు పార్కుకు వచ్చి వాకింగ్, వ్యాయామం, యోగా చేస్తుంటారు. అయితే పార్కులో తగినంత వెలుతురు లేకపోవడంతో చీకట్లోనే వాకింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఇటీవల కురుస్తున్న వర్షాలతో పార్కులో గడ్డి దట్టంగా పెరిగిపోయిందని, దీంతో విష జంతువులు, క్రిమికీటకాలు సంచరించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ వెంట పెరిగిన గడ్డి, మొక్కలను తొలగించి పార్కును పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.అదేవిధంగా పార్కులో వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన పరికరాలు సరైన నిర్వహణ లేకపోవడంతో దెబ్బతిన్నాయని తెలిపారు. పరికరాల అడుగు భాగాలు పూర్తిగా చెడిపోవడంతో అవి ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడటం లేదని పేర్కొన్నారు. వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.ఖానాపూర్ పట్టణ జనాభాకు అనుగుణంగా పార్కులు, ఇతర ప్రజా వసతులు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఉన్న పార్కును సైతం సరైన నిర్వహణతో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.











