.గోప్య పరిశీలన.. అధికారుల తీరుపై అనుమానాలు!
కుబీర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో రూ.76 లక్షల ప్రజాధనంతో నిర్మించిన మురికి కాలువ కూలిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. కాలువను మంగళవారం అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా వచ్చి పరిశీలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం మీడియా ప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసుకోవడంపై స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ నాణ్యతపై వివరణ ఇవ్వాల్సిన అధికారులు ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకుని అందుబాటులో లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోందని మండిపడుతున్నారు. ప్రజల పన్నుల సొమ్ముతో చేపట్టిన పనులు కూలిపోతే బాధ్యత వహించాల్సిన అధికారులు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు మండలంలో ఎక్కడ పనులు చేపట్టినా నాసిరకంగానే చేస్తున్నారని స్థానిక నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు నాణ్యతగా ఉండవని, దీనికి మండలంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారు? నిర్మాణ నాణ్యతపై ఏం తేల్చారు? బాధ్యులు ఎవరు? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి నిజాలను బహిర్గతం చేయాలని, తప్పు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు










