కీసర, 3 September
మండలం చీర్యాల పరిధిలోని ఎన్‌జేఆర్ కాలనీలో ప్రధాన రహదారి అధ్వానంగా మారి, పెద్దపెద్ద గుంతలతో ప్రమాదాలకు నిలయంగా మారిందని సీపీఎం మండల కమిటీ ఆరోపించింది. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేసింది.
ఎన్‌జేఆర్ కాలనీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలు.. పట్టించుకోని అధికారులు: సీపీఎం , సెప్టెంబర్ 3: మండలం చీర్యాల పరిధిలోని ఎన్‌జేఆర్ కాలనీ (సర్కిల్–1) ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. కాలనీలోని ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిని పెద్దపెద్ద గుంతలతో అధ్వానంగా మారిందని సీపీఎం మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఎన్‌జేఆర్ కాలనీని సందర్శించిన ఆయన రహదారి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు సమస్యపై స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ఆటోలు, అంబులెన్స్‌ల వంటి అత్యవసర వాహనాలు సైతం కాలనీలోకి రావడానికి ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే స్పందించాలని, గుంతలను పూడ్చేందుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారంగా బీటీ లేదా సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసుల ప్రాణాలకు రక్షణ కల్పించి ప్రమాదాలను నివారించేందుకు రహదారి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సీపీఎం మండల కమిటీ తరఫున కోరారు.












