తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న తన సొంత రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌లో ఈ ప్రకటన వెలువడింది.
శ్రీరామనవమి పండుగ సందర్భంగా, కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన కొత్త పార్టీని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పేరు, జెండాను కూడా ప్రకటిస్తామని వెల్లడించారు. మేడ్చల్ మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
నిజామాబాద్‌లోని తన మెట్టినిల్లు నుంచి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 'నేను నిజామాబాద్ కోడలిని, తెలంగాణ బిడ్డను. నిజామాబాద్ నుంచి తీసుకునే ఆలోచన, నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేస్తుంది' అని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా సాధించుకోలేకపోయామని, ప్రజలు ప్రస్తుత పరిపాలనపై ఆలోచించాలని ఆమె అన్నారు.
రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి అవసరమని, సర్వోదయ తెలంగాణ సాధన లక్ష్యంగానే కొత్త పార్టీ రావాలని కవిత అభిప్రాయపడ్డారు. కొత్త తరం నాయకత్వానికి, మహిళా సాధికారతకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు ఆమె వెల్లడించారు. తమ అజెండా ఏమిటనేది పార్టీ ఆవిర్భావ రోజున ప్రకటిస్తామని కవిత తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వర్గాల్లో ఈ కొత్త పార్టీ ప్రభావంపై ముమ్మర చర్చ జరుగుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు సాంస్కృతిక మూలాలను బలంగా విశ్వసించే కవిత, ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












