రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు జొన్నలు విక్రయించి నష్టపోవద్దని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.
భైంసా పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్, చైతన్య మండల మహిళా సమాఖ్య భైంసా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని, అలాగే కుభీర్ మండల కేంద్రంలో కుభీర్ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు క్వింటాల్‌కు రూ.3,699 కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకురావాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.











