సొనాల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు మోకాళ్లపై నిలబడి ఆందోళన చేపట్టారు. ధాన్యం తరలింపులో ఆలస్యం, బార్దాన్ల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆరోపించారు.
బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, ధాన్యం తరలింపులో అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తున్నారని, నెలరోజులుగా పంటను తరలించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గన్ని సంచులు, లారీల కొరతతో పాటు ప్రస్తుతం బార్దాన్ల కొరత కూడా రైతులను బాధిస్తోందని తెలిపారు.
మరో వారం రోజుల్లో రుతుపవనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యం పరిస్థితిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా, దుక్కులు సిద్ధం చేసుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తుల శ్రీనివాస్ విమర్శించారు. కనీస మద్దతు ధర కల్పించడంలో, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఎకరాకు 25-30 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నా, కేవలం 10 క్వింటాళ్లే కొనుగోలు చేయడం అన్యాయమని ప్రశ్నించారు.
రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.











