ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పై తప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలు విరమించుకోవాలని మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ భార్గవ్ తిరునగరు పిలుపునిచ్చారు. ఇటీవల ఒక రాజకీయ విశ్లేషణ సందర్భంగా జనసేన పార్టీ పేరుతో కొందరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖలో పనిచేసిన అనుభవం ఉందని, మహబూబ్ నగర్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి శాసనమండలిలో కీలక పాత్ర పోషించారని భార్గవ్ తిరునగరు గుర్తు చేశారు. ఆయన శాస్త్రీయ వివరణా శైలిని, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా విశ్లేషించే తీరును ప్రశంసించారు.
జాతీయ, అంతర్జాతీయ గణాంకాలతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను విశ్లేషించడంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ఎవరూ సాటిరారని, ఆయన నిష్పాక్షిక విశ్లేషణకు వివిధ టీవీ ఛానళ్లు ఆహ్వానిస్తున్నాయని తెలిపారు. ఆయన రాజకీయ, ఆర్థిక విశ్లేషణలు స్వతంత్రంగా, ఏ ప్రలోభాలకు లోనుకాకుండా ఉంటాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పై ఆయన సందర్భానుసారం చేసిన సమీక్షపై జనసేన పార్టీ వర్గీయులుగా చెప్పుకుంటున్న కొందరు ఫిర్యాదు చేయడం అక్రమం, అప్రజాస్వామికమని భార్గవ్ తిరునగరు అభివర్ణించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ పై తప్పుడు ఫిర్యాదులకు పాల్పడటం పత్రికా స్వేచ్ఛకు, భావ వ్యక్తీకరణపై గొడ్డలి వేటు లాంటిదని, ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు దీనిని ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








