తానూర్, జులై 23
తానూర్ మండలంలోని ఝరి బి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతు ఉండేపోళ్ల సాయినాథ్ పొలంలో ఫామ్ కుంట నిర్మాణ పనులకు గురువారం భూమి పూజ నిర్వహించి, అధికారికంగా పనులను ప్రారంభించారు. ఈ పథకం గ్రామీణుల ఆర్థిక సాధికారతతో పాటు భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని సాంకేతిక సహాయకుడు రమణ గౌడ్ తెలిపారు.
గ్రామీణ రైతుల ఆర్థిక సాధికారతతో పాటు భూగర్భ జలాల మట్టం పెంపునకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగకరమని సాంకేతిక సహాయకుడు రమణ గౌడ్ అన్నారు. తానూర్ మండలంలోని ఝరి బి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతు ఉండేపోళ్ల సాయినాథ్ పొలంలో మంజూరైన ఫామ్ కుంట నిర్మాణ పనులకు గురువారం భూమి పూజ నిర్వహించి అధికారికంగా పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రమణ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టడమే ఫామ్ కుంటల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వీటి ద్వారా సాగునీటి అవసరాలకు నీరు అందుబాటులో ఉండటంతో పాటు భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు, బావుల్లో నీటి మట్టం మెరుగుపడుతుందని వివరించారు. అలాగే చేపల పెంపకం వంటి అనుబంధ రంగాల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని, ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కూలీలకు స్థానికంగానే ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు.
రైతు ఉండేపోళ్ల సాయినాథ్ పొలంలో ఫామ్ కుంట మంజూరు కావడం పట్ల గ్రామ రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జాదవ్ విక్రమ్, సాంకేతిక సహాయకుడు రమణ గౌడ్, క్షేత్ర సహాయకుడు, లబ్ధిదారుడు ఉండేపోళ్ల సాయినాథ్, గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ కూలీలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












