హైదరాబాద్, జూలై 30
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి (సినారె) జయంతి సందర్భంగా కళా సేవా సమితి, తెలంగాణ ఆధ్వర్యంలో డా. పెరుక రాజుకు ‘సినారె సాహితీ పురస్కారం–2026’ను ప్రదానం చేశారు. సాహిత్య రంగానికి విశిష్ట సేవలు, సామాజిక చైతన్యంతో కూడిన రచనలకు గాను ఈ పురస్కారం అందించారు.
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి (సినారె) జయంతిని పురస్కరించుకుని కళా సేవా సమితి, తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ జాతీయ కవి, రచయిత, అనువాదకుడు, బహుభాషావేత్త డా. పెరుక రాజుకు ‘సినారె సాహితీ పురస్కారం–2026’ను ప్రదానం చేశారు.
సాహిత్య రంగానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, సామాజిక చైతన్యంతో కూడిన రచనలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత కళా పరిషత్లో జరిగిన కార్యక్రమంలో డా. పెరుక రాజును పుష్పగుచ్ఛం, శాలువా, తలపాగాతో ఘనంగా సన్మానించి పురస్కారాన్ని అందజేశారు.
కూలీ, రైతు కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన డా. పెరుక రాజు ప్రస్తుతం భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు. కవిగా, గేయరచయితగా, అనువాదకుడిగా అనేక భారతీయ భాషల మధ్య సాహిత్య భావాలను అనుసంధానం చేస్తూ విశేష గుర్తింపు పొందారు. ఆయన రచనల్లో జాతీయత, మానవత్వం, సామాజిక బాధ్యత, సాంస్కృతిక ఐక్యత ప్రతిబింబిస్తాయి.
సామాజిక సేవలో భాగంగా “మై గిఫ్ట్” స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి సేవలు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా డా. పెరుక రాజు మాట్లాడుతూ, “ఈ పురస్కారం నాకు మాత్రమే కాదు.. మానవత్వాన్ని నమ్మి సాహిత్యాన్ని సృజించే ప్రతి సాహితీవేత్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని అన్నారు.
కార్యక్రమంలో శ్రీమతి స్వప్న కిశోర్, దైవజ్ఞ శర్మ, సీపీఆర్ చంద్రమౌళి, సీహెచ్ శశిబాల, అంజని కుమార్, రజిత, కృష్ణ ప్రసాద్, చందు తదితర సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, విద్యావేత్తలు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.












