కుండపోత వర్షాలకు వికలాంగుడి ఇల్లు కూలింది.. అధికారుల సాయం కోసం ఎదురుచూపు
బోథ్, జూలై 30 (మనోరంజని తెలుగు టైమ్స్ ): మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోథ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఓ వికలాంగుడి ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీకి చెందిన దాసరి గంగయ్య అనే వికలాంగుడి నివాసం గురువారం వర్షాలకు కుప్పకూలింది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కష్టపడి నిర్మించుకున్న ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో గంగయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.తన ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని గంగయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి తక్షణ ఆర్థిక సాయం అందించి, నివాసం కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.












