బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
సోనాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలందిస్తున్న డాక్టర్ నవీన్ రెడ్డిని డిప్యూటేషన్ పై బదిలీ చేయడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్, వైద్యాధికారికి విజ్ఞప్తి చేశారు. ఆయనను తిరిగి సోనాలకే బదిలీ చేయాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
సోనాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నవీన్ రెడ్డిని డిప్యూటేషన్ పై పంపిన ఉత్తర్వులను రద్దు చేసి, తిరిగి సోనాల మండల కేంద్రంలోనే ఆయన విధులను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యాధికారికి విన్నవించడం జరిగింది.
11 సబ్ సెంటర్లు, 33 గ్రామ పంచాయతీలు, హాస్టల్ విద్యార్థులు, సుమారు 20 వేల జనాభాకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నవీన్ రెడ్డిని ఆకస్మికంగా డిప్యూటేషన్ పై వేరే ప్రాంతానికి పంపడం వలన ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాటు, డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే తరుణంలో, వైద్యుడిని వేరే కేంద్రానికి బదిలీ చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతానికి ఆరోగ్యవంతమైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సోనాల మండల కన్వీనర్ గాజుల పోతన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కసిరే పోతన్న, మాజీ సర్పంచ్ చింతల్ బోరి రాందాస్ పాల్గొన్నారు.












